అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ విజయ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంనగర్‌కు చెందిన వృద్ధ దంపతులు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం చికిత్స కోసం ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చూపించుకుని బండిపై తిరిగి వెళ్తుండగా.. ఆర్టీసీ డిపో-1 వద్ద వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న వృద్ధురాలు భూలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందింది.