అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండలం బడాపహడ్ దర్గాలో నిర్వాహకులు భక్తులపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అడిగినంత డబ్బులు హుండీలో వేయకపోవడంతో ఆదివారం పలువురిపై దాడి చేసినట్లు సమాచారం. అయితే ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయని భక్తులు చెబుతున్నారు. బడాపహడ్ దర్గాలో మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లిన భక్తులకు హుండీలో డబ్బులు వేసేవరకు నిర్వాహకులు వదిలిపెట్టడంలేదు. తాము ఎంత చెబితే అంత డబ్బులు వేయాలని నిర్వాహకులు భక్తులపై దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారు. నిరాకరించిన భక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. కొంతమంది వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడంతో భక్తులకు చుక్కలు చూపెడుతున్నారు. దర్గా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. డబ్బుల విషయంలో భక్తులపై నిర్వాహకులు తరచూ దాడులకు పాల్పడుతున్నారని, నిలదీస్తే భక్తులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్గాకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.