అక్షరటుడే, కామారెడ్డి: ఫారెస్ట్ అధికారులపై భూ కబ్జాదారులు దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లిలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి బీట్ పరిధిలో కొందరు అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తున్నారన్న సమాచారం రావడంతో మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్ సిబ్బందితో వెళ్లారు. అటవీ భూములను చదును చేస్తున్న వారిని సముదాయిస్తున్నప్పటికీ కొంతమంది వ్యక్తులు మైసమ్మ చెరువు వద్ద కాపు కాసి జీపులో ఉన్న అధికారులను బయటకు లాగి కొట్టారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేష్, బీట్ ఆఫీసర్ నాగరాజు, బేస్ క్యాంప్ ఆఫీసర్ మోహన్ గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తులపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కుంచెం లింగం, బోదాసు సురేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.