అక్షరటుడే, ఆర్మూర్‌: కాలం చెల్లిన చాక్లెట్లను విక్రయించగా.. అవి తిన్న చిన్నారులు వాంతులు విరేచనాలకు గురైన సంఘటన ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో గల ఓ బేకరీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మూర్‌ పోలీసులు బేకరీకి చేరుకొని కాలం చెల్లిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. చాక్లెట్లు సరఫరా చేసిన ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్మూర్‌ చెందిన ప్రముఖ నాయకుడు రంగంలోకి దిగి ఎలాంటి కేసు లేకుండా సెటిల్మెంట్‌ చేసినట్లు సమాచారం. కాలం చెల్లిన చాక్లెట్లు విక్రయిస్తున్నప్పటికీ.. ఫుడ్‌ సేఫ్టీ, మున్సిపల్‌ అధికారులు బేకరీ నిర్వాహకుడిపై గాని, ఏజెన్సీ నిర్వాహకులపై గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయమై ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో రవికుమార్‌ను సంప్రదించగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చూసుకుంటారని సమాధానం ఇచ్చారు.