అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: బజ్జీల కోసం జరిగిన గొడవ కారణంగా ముగ్గురు జైలు పాలైన ఘటన నిజామాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన ఆకాశ్‌, మనీష్‌, ప్రమోద్‌లు రెండు రోజుల క్రితం తెల్లవారు జామున బజ్జీలు తినేందుకు బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు. బజ్జీలు తింటుండగా.. ఆకాశ్‌ మరో రెండు బజ్జీలు కావాలని హోటల్‌ ఓనర్‌ సచిన్‌ను అడిగాడు. కాగా డబ్బులిస్తేనే ఇస్తానని చెప్పడంతో ఫోన్‌పే చేశాడు. ఇంతలో మరో వ్యక్తి క్యాష్‌ ఇచ్చి బజ్జీలు తీసుకున్నాడు. అయితే బజ్జీలు అయిపోయాయని హోటల్‌ యజమాని చెప్పడంతో డబ్బులు ఫోన్‌ పే చేశానని.. బజ్జీలు కావాల్సిందేనని గొడవకు దిగాడు. ఈ క్రమంలో మాటామాట పెరగడంతో యజమాని సచిన్ ఆకాశ్ పై దాడికి దిగడంతో గాయాలయ్యాయి. ఆగ్రహంతో ఆకాశ్‌తో పాటు మనీష్‌, ప్రమోద్‌లు కలిసి మరుసటి రోజు పెట్రోల్‌ బాటిళ్లు తీసుకెళ్లి.. హోటల్‌ యజమాని సచిన్‌ ఇంటిపై విసిరి నిప్పంటించారు. ఘటనపై సచిన్‌ ఆదివారం మూడో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసునమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.