Advertisement

అక్షరటుడే, హైదరాబాద్‌: మారుతున్న కాలానికి తగ్గట్లుగా ఇంటర్‌ విద్యలో విప్లవాత్మక అంశాలు పొందుపరచాలని ఇంటర్‌ బోర్డు యోచిస్తోంది. ఈ మేరకు ఫిజికల్‌ సైన్స్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), రోబోటిక్స్‌, డేటా సైన్స్‌ తదితర అంశాలను చేర్చాలని భావిస్తోంది. కొవిడ్‌ మహమ్మారి లాంటి వ్యాధులపై కూడా అవగాహన పెంచేలా సిలబస్‌ లో మార్పులు తీసుకొచ్చి విద్యా సంవత్సరం పుస్తకాల్లో పొందుపరచాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

భారం తగ్గిస్తూనే.. ముఖ్యమైనవి చేర్చి..

విద్యార్థులపై చదువుల భారం తగ్గించేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌ సిలబస్‌ను తగ్గించాలని బోర్డు భావిస్తూనే.. అవసరమైన అంశాలు చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం సైన్స్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టుల్లోని సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్‌ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో సిలబస్‌ కమిటీలు వేశారు.

సెకండియర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఛాప్టర్లో..

ఇంటర్‌ సెకండియర్‌ ఫిజిక్స్‌ ఎలక్ట్రానిక్స్‌ ఛాప్టర్లో కొన్ని అంశాలు తొలగించి.. ఏఐ, రోబోటిక్స్‌, డేటా సైన్స్‌, మిషన్‌ లర్నింగ్‌ తదితర అంశాలను చేర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కోర్సులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో ముందుగానే వీటిని విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు భారం కాకుండా సంక్షిప్తంగా పొందుపరచనున్నారు.

ఎన్సీఈఆర్టీ సిలబస్‌ ఆధారంగా..

జువాలజీలో ‘కొవిడ్‌’ అంశాన్ని చేర్చబోతున్నారు. ఇలాంటి వైరస్‌లు వ్యాపిస్తే తీసుకునే జాగ్రత్తలు, ప్రజలకు అవగాహన కల్పించడం అంశాలను సిలబస్‌లో నిక్షిప్తం చేయనున్నారు. విద్యార్థులపై భారం పడకుండా సిలబస్‌లో మార్పులు చేస్తున్నామని ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌ ని దృష్టిలో పెట్టుకొని జేఈఈ, నీట్‌, సీయూఈటీ ప్రవేశ పరీక్షలకు తగ్గట్టుగా ఈ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.

Advertisement