Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: లైంగిక వేధింపుల కేసులపై కేళర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారు వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఏకపక్ష దర్యాప్తు జరపొద్దని కేరళ హైకోర్టు ఇటీవల పోలీసులను హెచ్చరించింది. ‘నౌషాద్ కె వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ & ఎన్ఆర్’ కేసు విచారణ సందర్భంగా పైవ్యాఖ్యలు చేసింది. ఇటువంటి విధానం నిందితుడి ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది.

నిందితుడి వాదనలూ వినాలి..

నేర దర్యాప్తు సమయంలో, అధికారులు ఫిర్యాదుదారుతోపాటు నిందితుడి వాదనలను పరిశీలించాలని సూచించింది. కేవలం మహిళ కథనాన్నే ప్రమాణికంగా పరిగణించకూడదని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.

తప్పుడు ఆరోపణకు శిక్ష విధించాలి..

దర్యాప్తు సమయంలో, ఒక మహిళ ఒక పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తప్పుడు ఆరోపణ చేసిందని పోలీసు అధికారుల విచారణలో తేలితే.. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించే కేసులు పెరుగుతున్న ధోరణిని ఈ సందర్భంగా న్యాయమూర్తి నొక్కిచెప్పారు. వారి ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని పరిహారంతో తొలగించలేమని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు.

డబ్బు చెల్లించడం ద్వారా నష్టాన్ని భర్తీ చేయలేం..

తప్పుడు కేసుల్లో ఇరికించడం వల్ల పౌరుడికి కలిగే నష్టాన్ని డబ్బు చెల్లించడం ద్వారా భర్తీ చేయలేం. ఒకేఒక తప్పుడు ఫిర్యాదు ద్వారా అతని సమగ్రత, సమాజంలో స్థానం, ప్రతిష్ట దెబ్బతింటుంది. దర్యాప్తు దశలోనే క్రిమినల్ కేసుల్లో సత్యాన్ని కనుగొనడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Advertisement