అక్షరటుడే, వెబ్ డెస్క్ : ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పండి” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను హైకోర్టు ప్రశ్నించింది. నోడల్ ఏజెన్సీ ఎందుకు అంత దూకుడుగా వెళ్తుందో అర్థంకావడం లేదని.. శనివారం నోటీసులు అందితే ఆదివారం ఉదయం కూల్చివేస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. ‘కనీసం సెలవు రోజు కూడా అవకాశం ఇవ్వరా? సోమవారం వరకైనా ఆగే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏమిటో చెప్పండి’ అని హైడ్రా కమిషనర్ ను నిలదీసింది. హైకోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరు కాగా చివాట్లు పెట్టింది. చార్మినార్‌ను కూడా కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కూల్చేస్తారా.. అని తీవ్రంగా మందలించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని ప్రశ్నించింది.