అక్షరటుడే, హైదరాబాద్‌: కృష్ణా నదిపై కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఐకానిక్ వారధి నిర్మాణానికి లైన్ క్లియర్ అవుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి 80 కి.మీ.లు తగ్గేలా నిర్మించే కొత్త హైవే పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తి కావొచ్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొట్ర నుంచి ఏపీలోని నంద్యాల వరకు 167-కే హైవే పనులు చేపట్టారు. వారధి నిర్మాణానికి నేషనల్ హైవే సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఈ ఐకానిక్ వంతెన పనులు పూర్తయితే కొల్లాపూర్ పర్యాటక హబ్​గా మారనుంది.

కృష్ణమ్మ అందాలు చూడొచ్చు

తెలంగాణలోని సోమశిల(మల్లేశ్వరం) నుంచి ఏపీలోని సంగమేశ్వరం వరకు నదిలో కేవలం రెండు పిల్లర్లపై వంతెన నిర్మించనున్నారు. రూ.1,082.56 కోట్లతో రెండు ఫ్లోర్లుగా పనులు చేపట్టనున్నారు. సెకండ్ ఫ్లోర్​లో గ్లాస్ రోడ్డు ఉంటుంది. కృష్ణా నది అందాలు చూసేందుకు గ్లాస్ బ్రిడ్జిపై నుంచి నడిచి వెళ్లే అవకాశం కల్పిస్తారు. బ్రిడ్జి కింది నుంచి పడవలు, బోట్లు, లాంచీలు వెళ్లేందుకు వీలుగా రెండు పిల్లర్ల మధ్య 482 మీటర్ల దూరం ఉండేలా చూస్తారు.

ఐదు ప్యాకేజీలుగా పనులు

  • ప్యాకేజీ-1: కల్వకుర్తిలోని కొట్ర నుంచి కొల్లాపూర్ వరకు రూ.401 కోట్లతో రోడ్డు.
  • ప్యాకేజీ-2: అప్రోచ్​ రోడ్లకు రూ.286 కోట్లు.
  • ప్యాకేజీ–3: డబుల్ హైబ్రిడ్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,082 కోట్లు.
  • ప్యాకేజీ-4 : ఏపీలోని సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల వరకు రూ.380 కోట్లతో రోడ్డు.
  • ప్యాకేజీ-5: వెలుగోడు రిజర్వ్ ఫారెస్ట్​లో రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు.