అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఒప్పందాల పేరిట రైతులతో సంతకాలు తీసుకుని వారి పేరున ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ రుణాలు పొందింది. ఈ రుణాలు మాఫీ అయినట్లు రైతుల ఫోన్లకు మెస్సేజ్‌లు రావడంతో బండారం బయటపడింది. కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బైబ్యాక్ ఒప్పందం పేరిట రైతుల సంతకాలు తీసుకుంది. అయితే వారికి తెలియకుండానే నిజామాబాద్‌లోని నాందేవ్‌వాడ యూనియన్ బ్యాంకులో పెద్ద ఎత్తున లోన్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు ఫ్యాక్టరీ తీరుపై మండిపడ్డారు. అడ్లూరు ఎల్లారెడ్డి, పోసానిపేట్, సదాశివనగర్, మర్కల్, కుప్రియాల్ గ్రామాల రైతులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు తెలియకుండానే బ్యాంకుల్లో రుణాలు పొందిందని, రుణం మాఫీ అయినట్లు వారి ఫోన్లకు మెసేజీలు వచ్చాయన్నారు. వందలాది మంది రైతుల పేరిట లోన్లు పొందినట్లు తెలిసిందన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి రుణమాఫీ డబ్బులను రైతులకే చెల్లించాలని డిమాండ్ చేశారు.