అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలోని నాగర్ కర్నూల్(Nagarkurnool) పరిధిలో ఉన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(Srisailam Left Bank Canal - SLBC) సొరంగంలో 12 ఏజెన్సీల భారీ రెస్క్యూ ఆపరేషన్ ఏడవ రోజు కూడా కొనసాగింది. ఫిబ్రవరి 22న 14వ కి.మీ. పాయింట్ వద్ద టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఎనిమిది మంది చిక్కుకుపోయారు.
వివరాలు బయట పెట్టరే..
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(SLBC ) సొరంగంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(ground penetrating radar – GPR) టెక్నాలజీ(technology) ద్వారా స్కాన్ చేస్తే.. మృతదేహాలు దొరికే అవకాశం ఉన్న కొన్ని అంశాలు వెల్లడయినట్లు ప్రచారంలో ఉంది. కాగా, దీనిని అధికారికంగా బహిర్గతం చేయడం లేదు. కానీ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(Geophysical Research Institute – NGRI) కనుగొన్న దాని ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదవత్ సంతోష్ తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో 12 ఏజెన్సీల బృందాలు
రెస్క్యూ ఆపరేషన్‌లో ఆర్మీ, NDRF, SDRF, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, HYDRA, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్లు, ర్యాట్ మైనర్లతో సహా 12 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత..
తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాజెక్టుగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ను చెప్పుకోవచ్చు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నాలుగు దశాబ్దాల కిందటే బీజం
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల కిందట బీజం పడింది. ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు అధ్యయనం చేయాలని 1978లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీని వేశారు. సర్వే చేపట్టిన కమిటీ.. సొరంగం ద్వారా నీటిని తరలించాలని తొలిసారిగా సూచించింది. ఈ ప్రాజెక్టు చేపట్టాలనుకున్న ప్రాంతం అంతా రిజర్వ్డ్ ఫారెస్ట్ కావడంతో ఓపెన్ కాల్వలు తవ్వడానికి వీలులేదని, టన్నెల్ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు.
రెండుసార్లు శంకుస్థాపన
ఆ తర్వాత పన్నెండేళ్లకు అంటే.. 1980లో అక్కమ్మ బిలం వద్ద సొరంగం నిర్మాణానికి అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. రెండోసారి అంటే.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1983 మే నెలలో ఎడమ గట్టు, కుడి గట్టు కాలువలకు శంకుస్థాపన చేశారు.
తెరపైకి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం
సొరంగం నిర్మాణం ఆలస్యమవుతోందని భావించి.. ప్రత్యామ్నాయంగా 1995లో నల్లగొండ జిల్లా పుట్టంగండి నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి నిర్మాణం చేపట్టారు. దీనికి ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టారు. పుట్టంగండి నుంచి నీటిని తరలించడంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
మరోమారు ముందుకొచ్చిన సర్కారు
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించినప్పటికీ.. సొరంగంతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందనే వాదన ఉండడంతో.. 2005లో ప్రభుత్వం మరోమారు ముందుకు వచ్చింది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను రూ.2813 కోట్లతో చేపట్టేందుకు 2005 ఆగస్టులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆమోదించింది. సొరంగం పనులకు అప్పటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2007లో పనులు ప్రారంభమయ్యాయి.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు లక్ష్యం..
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 826 అడుగులు ఉన్నప్పుడు.. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీనిద్వారా నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా నీటిని తరలించాలని నిర్ణయించింది.
రెండు సొరంగాలు..
ప్రాజెక్టులో భాగంగా రెండుచోట్ల సొరంగాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్, రెండు లింక్ కెనాల్స్ నిర్మించాల్సి ఉంది. నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు రెండో సొరంగం(టన్నెల్ -2) 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. 43.93 కిలోమీటర్ల మొదటి సొరంగం(టన్నెల్) తవ్వడమే అత్యంత కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం)తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది.
ఇంకా ఏయే పనులు పెండింగ్‌లో ఉన్నాయంటే..
శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం(టన్నెల్-1)ను 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి రెండు వైపులా అంటే.. ఇన్‌లెట్, అవుట్‌లెట్ వైపు నుంచి పనులు చేసుకుంటూ లోనికి వెళ్లారు. ఇంకా నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట, అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి మధ్య 9.56 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయ సముద్రం, పెండ్లిపాకాల రిజర్వాయర్ నిర్మించాల్సి ఉంది.
2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా..
2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ పూర్తికాలేదు. ఉమ్మడి ఏపీలో 52 శాతం, ఆ తర్వాత గత పదిన్నరేళ్లలో 23 శాతం పనులు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తికి ఇప్పటివరకు ఆరు సార్లు గడువు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు.
ఊటతో పనులకు ఆటంకం
ఇన్‌లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్దఎత్తున సీపేజీ(ఊట) వస్తుండడంతో పనులు చేపట్టడం కష్టమవుతోంది. డీవాటరింగ్, డీ సిల్టింగ్ చేసుకుంటూ పనులు కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. పై నుంచి పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పూత పూస్తూ పనులు చేపడుతున్నారు.
పెరుగుతున్న వ్యయం
మొత్తంగా ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.2647 కోట్లు ఖర్చు చేశారు. గత పదేళ్లలో రూ.500 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2019, 2020, 2021లకు కలిపి మూడేళ్లలో రూ. 10 కోట్లే కేటాయించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.4,637 కోట్లకు పెంచారు. ఈ మేరకు 2024-25 బడ్జెట్‌లో రూ.800 కోట్లు కేటాయించారు.
టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లు
- టన్నెల్ లోపల పనిచేయడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. సొరంగ మార్గంలో భూమి వదులుగా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్లాలి.
- టన్నెల్ మెషిన్ నడుస్తున్న సమయంలో పెద్దగా శబ్దం వస్తుంటుంది. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, దానికి తగ్గట్టుగా జర్మన్ పరికరాలు వాడాల్సి ఉంటుంది.
- సాధారణంగా టన్నెల్లో ప్రతి 500 మీటర్లకు ఒక రక్షణ ఛాంబరు ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. కానీ, ఎస్‌ఎల్‌బీసీ నిర్మించే ప్రాంతం రిజర్వ్డ్ ఫారెస్ట్ కావడంతో వాటి నిర్మాణానికి అవకాశం లేదు.
- భూమి లోపల కావడం, కిలోమీటర్ల లోపల మూసి ఉండే ప్రాంతం కావడంతో కొన్ని విష వాయువులు ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి ఉంటుంది కాబట్టి, బయట నుంచి ఎప్పటికప్పుడు గాలి పంపిస్తుండాలి.