అడ్డగోలు నియామకాలపై గప్‌చుప్‌..!

0

అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్‌ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్‌ నియామకాల్లో అక్రమాలపై అధికారులు మౌనం వీడడం లేదు. ‘ఆర్మూర్‌ మున్సిపాలిటీలో అడ్డగోలు నియామకాలు’ శీర్షికన ఈనెల 15న ‘అక్షరటుడే’ కథనం ప్రచురించింది. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా అసలు సమాచారం బయటకెలా వెళ్లిందన్న విషయమై ఆరా తీసేపనిలో పడ్డారు. అక్రమంగా నియమితులైన వారిలో కొందరు పాతవారే అయినా.. గతంలో వారికి అధికారులు రోజువారి కూలీ ప్రాతిపదికన డబ్బులు నేరుగా చేతికి అందించేవారు. కానీ ప్రస్తుతం వారినే ఔట్‌సోర్సింగ్‌ కింద క్రమబద్ధీకరించి రూ.14,687 వేతనం నేరుగా ఖాతాల్లో జయచేయడం విశేషం. రోజువారి కూలీలను ఔట్‌సోర్సింగ్‌ కింద బదలాయించడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సమాచారం. అక్రమ నియామకాలపై ఇప్పటికైనా అధికారులు విచారణ జరపాలని పట్టణవాసులు కోరుతున్నారు.