అక్షరటుడే, వెబ్‌డెస్క్: పేరుకుపోయిన ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిల విడుదల కోసం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సమ్మెబాట పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలో ఉన్న కళాశాలలను పూర్తిగా మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయా యాజమాన్యాలు ఇటీవల సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఇందులో కూలంకశంగా చర్చించి ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక బంద్ కు పిలుపునిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బకాయిలు విడుదల చేసే వరకు తెరవొద్దని సమిష్ఠిగా భావిస్తున్నాయి. అన్ని సెమిస్టర్ల పరీక్షలను కూడా బహిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని సుమారు 7 లక్షల విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది.
పేరుకుపోయిన బకాయిలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఒక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలే సుమారు రూ.5,900 కోట్లకు పైగా పేరుకుపోయాయని తెలుస్తోంది. ప్రస్తుత విద్యాసంవత్సరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా రూ.8వేల కోట్లకు పైగా పేరుకుపోతాయని అంచనా.
నిర్వహణ భారం
గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందనేది యాజమాన్యాల ఆవేదన. ఫీజు బకాయిల గురించి ఎన్నిసార్లు మంత్రులు, అధికార్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఓ డిగ్రీ కళాశాల యజమాని వాపోయారు. ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా సమయం ఇవ్వడంలేదని చెప్పుకొచ్చారు. ఫీజు బకాయిల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో 90శాతం కళాశాలలు.. సిబ్బందికి గత 4, 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని, భవనాల అద్దె చెల్లించలేని స్థితికి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దసరా తర్వాత ఓసారి ముందడుగు వేసినా..
ఫీజు బకాయిల వసూలు కోసం దసరా తర్వాత అక్టోబరు 14 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రం లోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలను మూసి వేసి ఉంచారు. ఎడ్యుకేషన్ సెక్రెటరీ వెంకటేశం రాష్ట్ర యాజమాన్య సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడి, వారం రోజుల్లోపే బకాయిలు విడుదల చేపిస్తామాని హామీ ఇచ్చి కళాశాలల బంద్ ను విరమింపజేసినట్లు తెలిసింది. ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడంతో మళ్లీ బంద్ బాట పడుతున్నట్లు సమాచారం.