అక్షరటుడే,వెబ్‌డెస్క్: పండుగల సీజన్‌లో రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈక్రమంలో టికెట్ లేని ప్రయాణికులకు చెక్ పెట్టెందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. టికెట్ నిబంధనలను ఉల్లఘించే వారిలో పోలీసులే అధికంగా ఉన్నారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు టికెట్ లేని, అనధికారిక ప్రయాణికులను కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వేశాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖలు రాసింది. ఉల్లంఘనులపై రైల్వేశాఖ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, తనిఖీలను పర్యవేక్షించేందుకు సీనియర్ స్థాయి అధికారి నియమించాలని సూచించింది. తనిఖీల నివేదికలను నవంబర్ 18 నాటికి పంపాలని పేర్కొంది.