అక్షరటుడే, హైదరాబాద్‌: “తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక నమూనా డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ఈ నివేదిక ప్రాతిపదికగా పనిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే -2024 నివేదికను ఈ శాసనసభలో ప్రవేశపెట్టడమనేది తనకు జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భమని చెప్పుకొచ్చారు.

1,12,15,137 కుటుంబాలు

తెలంగాణ గవర్నర్ తో మొదలుపెట్టి రాష్ట్రంలో 6 నవంబర్ 2024న సర్వే ప్రారంభించగా 25 డిసెంబర్ 2024 నాటికి పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో(66,99,602), నగర ప్రాంతాల్లో(45,15,532), మొత్తం 1,12,15,137 కుటుంబాలు(96.09 శాతం) ఉన్నట్లు సీఎం ప్రకటించారు.

బీసీలు 1,64,09,179 (46.25 శాతం)

సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), బీసీలు 1,64,09,179 (46.25 శాతం), ముస్లిం మైనారిటీల్లో బీసీలు 35,76,588(10.08 శాతం) ఉన్నారు. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకొంటే తెలంగాణలో మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉంది.

హిందూ ఓసీలు 13.31 శాతం

రాష్ట్రంలో మైనారిటీ జనాభా 44,57,012 (12.56 శాతం) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలో 80,424 (2.4 శాతం) ఉంది. హిందూ ఓసీలు 13.31 శాతం ఉంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకొంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం ఉంది.