అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆయా కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించడంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో కాలేజీలకు రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. రీయింబర్స్‌మెంట్ పెండింగ్ కారణంగా.. పలు కళాశాలల యాజమాన్యాలు టీసీ, ఇతర సర్టిఫికెట్లను కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అటు కాలేజీ యాజమాన్యాలు సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురవుతున్నాయి. ఇక కళాశాలలు నడపడం తమ వల్ల కాదంటూ తాజాగా తెలంగాణ డిగ్రీ- పీజీ కాలేజెస్ అసోసియేషన్ కాలేజీల నిరవధిక బంద్ కు పిలుపునిచ్చింది.
ఏళ్ల తరబడిగా పెండింగ్..
రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ. 6 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి నిధులు విడుదల చేయకపోవడంతో భారీగా బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. గతేడాది డిసెంబరు 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు.
వన్ టైం సెటిల్మెంట్ సాధ్యమయ్యేనా?
పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ పద్ధతిలో చెల్లించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై దృష్టి పెట్టింది. ఈ వన్‌టైం సెటిల్‌మెంట్ విషయంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు తమ బిల్లులను కొంత మేర తగ్గించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే కాలేజీల అసోసియేషన్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు.. బిల్లులను ఏ మేరకు తగ్గించుకుంటారనే విషయంపై ఒక అవగాహనకు వచ్చి, ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు సమావేశమై చర్చించినా.. ఈ అంశంపై ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం.
ఆందోళనలో 13 లక్షల మంది..
రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ వంటి కోర్సులను చదువుతున్న విద్యార్థులకు వివిధ ప్రాతిపదికల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. ఈ పథకం పరిధిలోకి ఏటా సుమారు 13 లక్షల మంది విద్యార్థులు వస్తుంటారు. ఇందుకోసం ప్రతి ఏడాది సర్కారుపై సుమారు రూ.2,250కోట్ల భారం పడుతోంది. రూ.6 వేల కోట్ల బకాయిలు ఈ ఏడాది మార్చి వరకు ఉన్నవి మాత్రమే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున వచ్చే మార్చి నాటికి కొత్త బిల్లులు జమ కానున్నాయి. ఈ పెండింగ్ బిల్లుల్లో సుమారు రూ.380 కోట్ల బిల్లులకు సంబంధించి అధికారులు గతేడాది నవంబరులో టోకెన్లు జారీ చేశారు. వీటికి సంబంధించిన చెల్లింపులు ఇప్పటికీ చేయలేదు.
సెటిల్మెంట్ పై నిరాసక్తత
బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా తాము ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్నామని, పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో వన్‌టైం పద్ధతిలో ఫీజు తగ్గించడం ద్వారా మరింత దెబ్బతింటామనే అభిప్రాయాన్ని పలు కాలేజీలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పైగా కాలేజీల నిర్వహణ కోసం ఇప్పటికే బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నామని చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సిబ్బందికి జీతాలను కూడా చెల్లించడం లేదని కాలేజీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలు విడుదల చేయాలి : హరిప్రసాద్
మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలో సోమవారం ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్ డబ్బులు రాకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని, స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు.