అక్షరటుడే, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 9 నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సైతం ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. తిరుగుపయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
Advertisement
Advertisement