అక్షరటుడే, వెబ్డెస్క్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్-2025 ప్రదర్శన అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి సైన్స్ ఎంతో అవసరమన్నారు. సీవీ రామన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయని కొనియాడారు. దేశ యువతలో శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన కల్పించడానికి సైన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు.
సీఎం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి రాజ్నాథ్ సింగ్కు ధన్యవాదాలు తెలిపారు. దేశ రక్షణలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక్కడ ఎన్నో రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్ చదివిన ఎంతో మంది విదేశాలకు వెళ్లి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అయితే దేశంలో పనిచేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని తెలపాడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు.