అక్షరటుడే, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత అంశం రాజ్యసభను కుదిపేసింది. వినేశ్ కు న్యాయం జరిగేలా చూడాలంటూ విపక్ష నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అనర్హతకు దారితీసిన పరిస్థితులపై చర్చించాలని పట్టుబట్టాయి. దీనికి రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు. ‘ఈ విషయం గురించి ప్రతిపక్ష నాయకులు మాత్రమే బాధపడుతున్నామని భావిస్తున్నారు. అందరికీ అదే బాధ ఉంటుంది. వినేశ్ ఫొగాట్‌కు జరిగిన అన్యాయంపై యావ‌త్ దేశం బాధలో ఉంది. ప్రతి ఒక్కరూ వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తే ఆమెను అవమానించినట్లే అవుతుంది’ అని విపక్ష సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తీరును సైతం ఖండించారు. ‘మీరు రాజ్యసభ ఛైర్మన్‌పై అరుస్తున్నారు. ఈ ప్రవర్తనను ఖండిస్తున్నాను. అలాంటి ప్రవర్తనను ఎవరైనా భరించగలరా?’ అని ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాసేపు సభ నుంచి ఆయన బయటకు వెళ్లిపోయారు.

భారత్ అండగా ఉంది: కేంద్ర మంత్రి నడ్డా

భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు యావత్ దేశం అండగా ఉందని రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రధాని వినేశ్‌ను ఛాంపియన్లకే ఛాంపియన్‌గా అభివర్ణించారని పేర్కొన్నారు. 140 కోట్ల దేశ ప్రజల భావన ఇదేనన్నారు. దురదృష్టవశాత్తూ ఈ అంశాన్ని సభలో విపక్షం, అధికార పక్షం అన్నట్లు విభజిస్తున్నారని ఆరోపించారు. వినేశ్ ఫొగాట్ అనర్హత వ్యవహారంలో కేంద్రం, క్రీడాశాఖ, భారత ఒలింపిక్‌ మండలి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. ప్రతిపక్షం చర్చించడానికి ఏ అంశం లేదని, ఒకవేళ ఉంటే చర్చకు అధికార పార్టీ సిద్ధమని స్పష్టం చేశారు.