అక్షరటుడే, కామారెడ్డి : Collector : మెడికల్ కళాశాలకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని, డబ్బులు ఇచ్చిన వారికే రాత్రికి రాత్రి ఆర్డర్ కాపీలిచ్చారని ఉద్యోగాలు రాని బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఇటీవల మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో మ్యాన్ పవర్ సొసైటీ అనే ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఉద్యోగాల కోసం కొన్ని వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, నియామకాలు పారదర్శకంగా కాకుండా అవినీతితో చేపట్టారని ఆరోపించారు. ఈ నియామకాలకి సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు ఆరోపించారు.
విచారణ జరిపి న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్, సంజయ్, బాధిత అభ్యర్థులు రఘువరన్, రవి, గణేష్, మమత, గోవర్ధన్, శ్రీకాంత్, సురేష్, రవితేజ, హరి, మంజుల తదితరులున్నారు.