అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగర శివారులోని ముబారక్‌నగర్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గుర్తు తెలియని కారులో ముబారక్‌ నగర్‌, గంగాస్థాన్‌ ఫేజ్‌-1లో అర్ధరాత్రి తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేశారు. నిమిషాల వ్యవధిలో ఇళ్ల తాళాలను పగులగొడుతూ చోరీలకు పాల్పడ్డారు. కారులో ముగ్గురు నిందితులు ఉండగా.. ఒకరు కారును నడపగా.. మరో ఇద్దరు తాళం వేసిన ఇళ్లలో చొరబడుతూ దొంగతనానికి పాల్పడ్డారు. ముబారక్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో నుంచి రూ.50 వేలు అపహరించారు. అలాగే అదే కాలనీలోని క్యాతం కళావతి ఇంట్లో చొరబడి రూ.30 వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అయితే దొంగలు వచ్చిన కారును సైతం హైదరాబాద్‌లో అపహరించినట్లు సమాచారం. దుండగులు కారులో ఆయా కాలనీల్లో తిరగడం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యింది. దొంగలు అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వాహనంలో వివిధ ప్రాంతాల్లో హల్‌చల్‌ సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.