అక్షరటుడే, వెబ్ డెస్క్: శ్రీవారి భక్తుల కోసం తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. వన్ డే టూర్ ప్యాకేజీలో స్వామివారి దర్శనంతో పాటు తిరుచానూరు అమ్మవారి దర్శనం చేయిస్తారు. ప్యాకేజీ ధరను రూ.12,499గా నిర్ణయించింది. ప్యాకేజీలో ఫ్లయిట్ టికెట్, కారు ట్రావెల్ చార్జీలు, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు చేయిస్తారు. అంతేకాకుండా మరో రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది. దీనికి రూ.15,499 చార్జీ ఉంటుంది. పూర్తి వివరాలకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్ tourism.telangana.gov.in సంప్రదించవచ్చు.
టూర్ ప్లాన్ ఇలా..
*హైదరాబాద్ నుంచి ఉదయం 6.55 గంటలకు ఫ్లయిట్ ప్రారంభమై 8 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది.
*రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి కారులో తిరుపతిలోని హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కారులో తిరుమలకు తీసుకెళ్తారు.
*మధ్యాహ్నం ఒంటి గంటలోపు తిరుమలలో శ్రీవారి స్పెషల్ దర్శనం చేయిస్తారు. అనంతరం తిరిగి తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది.
*గంట విశ్రాంతి తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. అటు నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
*సాయంత్రం 6.35 గంటల ఫ్లయిట్‌లో బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు.