
అక్షరటుడే, తిరుమల: Salakatla Vasanthotsavam : తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala Srivari Temple)లో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి (moon of Chaitra Shuddha)కి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
10వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి (Sridevi Bhudevi) సమేతంగా శ్రీ మలయప్ప స్వామి(Sri Malayappa Swamy) మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపాని(Vasanthotsavam Mandapam)కి వేంచేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఏప్రిల్ 11న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి(Sri Bhu Sametha Sri Malayappa Swamy) ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవం నిర్వహిస్తారు.
ఏప్రిల్ 12న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు (Seetharamalakshmana Anjaneyaswamy Utsavavars), శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు పెట్టారు. ఈ క్రతువులో సుగంధ పుష్పాల(fragrant flowers)ను స్వామికి సమర్పించటంతోపాటు వివిధ ఫలాలను నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
కాగా.. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ (Oonjal Seva), ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjitha Brahmotsavam), సహస్రదీపాలంకార సేవల (Sahasradeepalankara Seva)ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.