అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుపతి లడ్డూ ఎంతో శ్రేష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా వేంకన్న భక్తులు ఈ లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా నిత్యం లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని.. ప్రసాదాన్ని స్వీకరిస్తారు.. అంతలా ప్రఖ్యాతిగాంచిన లడ్డూ ప్రసాదం తయారీకి గతంలో జంతుకొవ్వు కలిపారంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలే ఈ విషయం వెల్లడించడంతో.. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఎన్ డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నివేదికతో..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనే ఎన్ డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను తీవ్రంగా కలిచి వేస్తోంది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ నివేదిక తీవ్ర వైరల్ గా మారి దుమారం రేపుతోంది.
వైసీపీ హయాంలో..
తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్ డి డి బి కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించింది. జూలై 8 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించగా.. జులై 17న నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో.. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేపనూనె, జంతుకొవ్వు, పామాయిల్, పందికొవ్వు ఉందని స్పష్టమవుతోంది.
ల్యాబ్ కు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు
ఎన్ డీడీబీ కాల్ఫ్ కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ల్యాబ్. ఈ నివేదికను టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు అందజేశారు. తిరుమల వెంకన్న స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కచ్చితంగా సీరియస్ ఎంక్వయిరీ చేస్తామని స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించేలా కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వాలిటీ నెయ్యి కేజీ కొనాలంటే రూ.1,000కి పైగా ఖర్చవుతుందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచిందన్నారు. నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్టు ఇచ్చారని గుర్తు చేశారు.
నెటిజన్ల తోడు..
తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందన్న వివాదం ముదిరి పాకాన పడుతుండగా.. నెటిజన్లు కూడా తోడయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పంపిన నమూనాల ల్యాబ్ నివేదికలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తీపి తిరుపతి లడ్డూలలో “బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్” మరియు ఇతర నాసిరకం పదార్థాలు ఉన్నాయని సూచించిన తర్వాత సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో దుమారం రేగుతోంది. శాంపిల్స్‌లో “పందికొవ్వు” (పంది కొవ్వుకు సంబంధించినది) ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ క్లెయిమ్ చేసింది. పరిస్థితికి ప్రతిస్పందిస్తూ, ఒక X వినియోగదారు ల్యాబ్ రిపోర్ట్‌ను పోస్ట్ చేశారు. “మీరు దీన్ని చదువుతూ ఇంకా సాధారణంగా శ్వాస తీసుకుంటుంటే.. సిగ్గుపడండి అని పోస్ట్ చేశారు. ఈ పోస్టును లక్షకు పైగా వీక్షకులు తిలకించారు. 4000 మందికి పైగా షేర్ చేశారు. పలువురు పోస్ట్‌పై వ్యాఖ్యానించారు. మరికొందరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నిందించారు.
వైఎస్సార్ సీపీ వివరణ
కాగా ఇది వేదికపై వైయస్సార్సీపి ఎక్స్ వేదికగా స్పందించింది. తిరుమల లడ్డూ వివాదంపై సదరు పార్టీ న్యాయవాది హైకోర్టు ధర్మసనాన్ని సంప్రదించినట్లు పేర్కొంది. సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని తమ న్యాయవాది కోరినట్లు ఎక్స్ వేదికగా వివరించింది.