అక్షరటుడే, వెబ్ డెస్క్: తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన దివ్య క్షేత్రంలో.. గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం వచ్చే రాజకీయ నాయకులలో కొందరు ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారు. దీనివల్ల తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. రాజకీయ విమర్శలు చేసే వ్యక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతీసే ప్రసంగాలకు దూరంగా ఉండి టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.