అక్షరటుడే, హైదరాబాద్: MLC elections : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అభ్యర్థుల ఎంపిక వద్దే ఆగిపోయింది. నామినేషన్ల దాఖలుకు రేపే(మార్చి 10 సోమవారం) చివరి రోజు. అయినా ఇంత వరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనుంది.
MLC elections : మొత్తం 5 స్థానాలు
మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా కాంగ్రెస్‌కు నాలుగు దక్కనున్నాయి. వీటి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. మరో స్థానం భారాసకు దక్కనుంది.
MLA quota MLC elections : అభ్యర్థుల కోసం కసరత్తు..
అసెంబ్లీలో సభ్యుల సంఖ్యా బలం ప్రకారం.. కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. కానీ, ఈ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. సొంత పార్టీ నేతల నుంచే కాకుండా.. తమకు కూడా ఒక్కోటి కేటాయించాలంటూ కాంగ్రెస్ మిత్రపక్షాలైన సీపీఐ, ఎంఐఎం కూడా పట్టుబడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, బానోతు విజయ్ బాయ్, పారిజాత నర్సింహా రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సినీ నటి, సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా టికెట్ కోసం పోటీ పడేవారిలో ఉన్నారు. ఇటీవలే ఆమె ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసినట్లు తెలిసింది. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేయకపోవడం విజయశాంతికి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.
MLA quota MLC elections : తెరపైకి బీసీ నినాదం..
ఇటీవల బీసీ నినాదం కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. బీసీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవిని ఆశించడమే ఇందుకు కారణం. బీసీ వర్గం నుంచి ఈరవత్రి అనిల్ కుమార్, చరణ్ కౌశిక్ యాదవ్, గాలి అనిల్ కుమార్, జెరిపాటి జైపాల్, కైలాష్ నేత తదితరులు టికెట్లు ఆశిస్తున్నారు. వీరితో పాటు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ కుమార్, హర్కర వేణు గోపాల్ రావు, గాంధీ భవన్ ఇన్‌ఛార్జి కుమార్ రావు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
MLA quota MLC elections : అసంతృప్తుల గళం
కాగా, కులగణన ప్రకారం.. బీసీలు 56 శాతం ఉన్నందున, ఆ ప్రాతిపదికనే సీట్లు కేటాయించాలనే డిమాండ్ పార్టీలోని బీసీ నేతల నుంచి ఉందని చెబుతున్నారు. పార్టీలో అగ్ర వర్ణాల పెత్తనంపై ఇటీవల సీనియర్ నేత మధుయాస్కీ గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బహిరంగంగా విమర్శించారు. మరోవైపు సీనియర్ నేత హన్మంతరావు ఇంట్లో ప్రతిపక్ష కాపు నేతలు సమావేశమై సర్కారును విమర్శించినట్లు ప్రచారంలో ఉంది. అసంతృప్తులను సంతృప్తి పర్చేందుకు కనీసం రెండు టికెట్లు అయినా బీసీలకు కేటాయించాల్సి ఉంటుందని అంటున్నారు.
MLA quota MLC elections : భారాస నుంచి ఎవరో..
ప్రతిపక్ష భారాసకు ఒక స్థానం దక్కనుంది. ఈ విషయమై ఇటీవలే పార్టీ అధినేత కేసీఆర్ నేతలు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కానీ, అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు ఒకే రోజు ఉన్నందున, ఈ రోజైనా అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారనే ఆశతో పార్టీ నేతలు ఉన్నారు.
MLA quota MLC elections : ఢిల్లీ పర్యటన రద్దు
అభ్యర్థులను ఖరారు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయంగా చెబుతున్నారు. అయితే, అభ్యర్థుల ఎంపిక విషయమై ఇటీవల రేవంత్ వరుసగా ఢిల్లీ పర్యటనలు చేపట్టారు. శనివారం కూడా వెళ్లాల్సి ఉండగా.. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్ఠానం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు ఉదయం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో కేసీ వేణుగోపాల్ ఫోన్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం.
MLA quota MLC elections : ఇదీ షెడ్యూల్..
- మార్చి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేది
- మార్చి 11 నామినేషన్ల పరిశీలన
- మార్చి 13 నామినేషన్ల ఉపసంహరణ
- మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- మార్చి 20న సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్, ఫలితాల ప్రకటన.