అక్షరటుడే, ఆర్మూర్: జాతీయ రహదారి 63పై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ లారీ పూర్తిగా దగ్ధమైంది. కాగా.. లారీలో ఉన్న ఇద్దరిని స్థానికులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ శివారులోని జాతీయ రహదారి 63పై గుజరాత్ నుంచి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన డ్రైవర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. మిగతా ఇద్దరు క్యాబిన్లో చిక్కుకున్నారు. ఇదే సమయంలో మంటలు వ్యాపించడంతో స్థానికులు వారిని కాపాడారు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్, ఎస్ఐ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది దగ్ధమవుతున్న లారీ మంటలను ఆర్పివేశారు. అనంతరం పోలీసులు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.