అక్షరటుడే, హైదరాబాద్: Traffic police : హైదరాబాద్ లో పోలీసుల నిర్లక్ష్యంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలానగర్లో చలనా కోసం బైక్ ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల వల్లే ఓ నిండు ప్రాణం పోయిందని వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భారీగా చేరుకున్న పోలీసులు.. వాహనదారులను చెదరగొట్టారు.
అసలేం జరిగిందంటే.. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న బైక్ ను పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించిన వాహనదారుడు అదుపుతప్పి బైక్ తో పాటు కింద పడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతని తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు.
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పి, అక్కడున్నవారందరినీ చెదరగొట్టారు.
మృతుడు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు అలియాస్ బాబ్జిగా గుర్తించారు. హైదరాబాద్ లో కార్పెంటర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదంపై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి తమ సోదరుడు జోష్ బాబు మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న వాహనాన్ని ఆపారన్నారు. బైక్ ముందుకు వెళుతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని లాగాడని, ఆ సమయంలో సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్ మద్యం మత్తులో ఉన్నాడని ఆరోపించారు. చొక్కా పట్టుకుని లాగడం వలననే అదుపుతప్పి జోష్ బాబు అలియాస్ బాజ్జీ బస్సు చక్రాల కింద పడి చనిపోయాడని ఫిర్యాదులో వివరించారు.