అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుపతి శ్రీవారి లడ్డూపై ఎలాంటి అనుమానాలొద్దని టీటీడీ ఆలయ ఈవో శ్యామలరావు సోమవారం స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదాల్లో వినియోగించే నెయ్యిని చాలా రోజుల క్రితమే మార్చేశామని, మార్పు చేసిన నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం, సంప్రోక్షణ చేశామన్నారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో కూడా సంప్రోక్షణ చేస్తున్నామని చెప్పారు. పూర్ణాహుతితో అన్ని దోషాలు తొలగిపోతాయని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు.