అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉత్తర కాలిఫోర్నియాలోని మతపరమైన ఒక ప్రైవేటు పాఠశాలలో గురువారం దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుట్టే కౌంటీ షెరీఫ్ కోరీ హోనియా ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఒరోవిల్లేలోని ఫెదర్ రివర్ స్కూల్ ఆఫ్ సెవెంత్-డే అడ్వెంటిస్ట్స్‌లో విద్యార్థులు మధ్యాహ్న విరామాన్ని ముగించే సమయంలో ఈ దాడి జరిగింది. కాల్పుల్లో 5, 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని గ్లెన్ లిట్టన్ (56)గా గుర్తించారు. అతనికి సుదీర్ఘ నేర చరిత్ర ఉందని, మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్‌లోకి ప్రవేశించేందుకు లిట్టన్ పాఠశాలను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని అధికారులు చెప్పారు.