అక్షరటుడే, వెబ్‌డెస్క్: Job Mela | రాష్ట్రంలో ఎంతో మంది యువత ఉద్యోగాల(Jobs) కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా లక్షలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రైవేట్ జాబ్ మేళా(Job Mela)లకు సైతం భారీగా హాజరు అవుతున్నారు. ఏదో కొలువులో చేరి కుటుంబానికి ఆసరాగా నిలవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు వేలాదిగా తరలివచ్చారు.
వరంగల్ నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జాబ్‌మేళా నిర్వహించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క(seethakka) ఈ మేళాను ప్రారంభించారు. జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడానికి దీనిని నిర్వహించారు. మెగా జాబ్ మేళా గురించి ముందుగానే ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు.
Job Mela | తొక్కిసలాటలో ముగ్గురికి గాయాలు
జాబ్‌మేళాకు మొత్తం23,238 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇంత భారీ సంఖ్యలో యువత రావడంతో తొక్కిసలాట చోటు చేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. అయితే 60 కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో 5,631 మందికి నియామకపత్రాలు అందించారు.