అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలను పొడిగిస్తామని కేంద్రబొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని, నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఆదివారం చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయసమీపంలో నూతన రైల్వే స్టేషన్‌ నిర్మాణం జరుగుతుందని, ఇది పూర్తయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. తెలంగాణలో అన్ని రైల్వేస్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, హైస్పీడ్‌ వైఫై ఫెసిలిటీ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ‘వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రొడక్స్‌’ స్టాల్స్‌ను వివిధ స్టేషన్లలో ఏర్పాటు చేశామని తెలిపారు.