అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో RK (రేవంత్‌రెడ్డి, కేటీఆర్‌) పాలన నడుస్తుందని, బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీని తెలంగాణలో నిషేధించాలన్నారు. కలెక్టర్‌ పై దాడి వెనుక కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారని చెప్పినా కాంగ్రెస్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి చెప్పిన దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తెలంగాణకు ఇద్దరు సీఎంలు ఒకరు రేవంత్‌రెడ్డి, మరొకరు కేటీఆర్‌ అని అన్నారు. రేవంత్‌ కుటుంబానికి, కేసీఆర్‌ కుటంబానికి సంబంధం లేదని నిరూపిస్తే తాను రాజకీయల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపించారు. మూసీ పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు.