అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర సహాయ మంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలిపారు. గురువారం లోక్‌ సభలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ అడిగిన ప్రశ్నకి ఆయన బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా విమానాశ్రయాల నిర్మాణానికి ఆరు చోట్ల ఫ్రీ ఎలిజిబిలిటీ అధ్యయనం నిర్వహించిందని తెలిపారు. ఇందులో వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బ్రౌన్‌ ఫీల్డ్‌, నిజామాబాద్‌ జిల్లాలో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా వీలున్నట్లు గుర్తించిందని తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఇతర రెగ్యులేటరీ, చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సూచించిందని మంత్రి పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో ఎంపీ అర్వింద్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి స్పందిస్తూ జక్రాన్ పల్లి విమానాశ్రయ నిర్మాణం, స్థల అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రాలేదని, ఓఎల్ఎస్ సర్వే పెండింగ్ లో ఉందని తెలిపారు.

ఓఎల్‌ఎస్‌ సర్వే తర్వాత ఎయిర్‌పోర్టు పనులు

కేంద్ర మంత్రితో భేటీ తర్వాత ఎంపీ అర్వింద్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఓఎల్‌ఎస్‌ సర్వే చేస్తే ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విమానాశ్రయ ఏర్పాటు అంశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సుదర్శన్‌ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవ తీసుకొని కేంద్రానికి త్వరగా ప్రతిపాదనలు పంపాలన్నారు.