అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక నగర్లోని ఓ టీ హోటల్ ముందు యువకుడు రక్తపు మడుగులో చనిపోయి ఉండడాన్ని హోటల్ యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. స్థానిక నాలుగో టౌన్ పోలీసులు, నగర సీఐ నరహరి అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని యువకుడిని మంగళవారం రాత్రి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆనవాళ్లు సేకరించారు. పోలీస్ జాగిలం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ఓ వైన్స్ వద్ద వరకు వెళ్లి అక్కడ పర్మిట్ రూంలో కలియతిరిగింది. అనంతరం వైన్స్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్యకు గురైన యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.