అయ్యో అన్నదాత.. వేల ఎకరాల్లో పంట నష్టం!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మొన్నటి వరకు సాగునీటి కోసం అన్నదాతలు ఆందోళన చెందారు. ఎండల తీవ్రతకు వ్యవసాయ బోర్ల నీరు సరిపోక పంటలు ఎండిపోయాయి. తీరా ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు. ఇంతలోనే.. శనివారం కురిసిన అకాల వర్షం అన్నదాతకు నీటికి బదులు కన్నీటిని మిగిల్చింది.

ముప్పై వేల ఎకరాలు

శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన కారణంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తంలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 20,071 ఎకరాల మేర పంట నష్టం జరిగిందని కలెక్టర్ జితెష్ వి పాటిల్ అధికారికంగా ప్రకటించారు. 15 మండలాల్లోని 130 గ్రామాలకు చెందిన 14,553 మంది రైతులు పంట నష్టపోయినట్లు లెక్కల్లో తేలింది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 11 వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. ఇందులో 5.5 వేల ఎకరాల మేర వారి ఉండగా.. మిగితా మొత్తంలో ఇతర పంటలు ఉన్నాయి.

పరిశీలనతో సరి పెడతారా?

పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఆదివారం కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బోధన్ లో సుదర్శన్ రెడ్డి, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇంతవరకు బాగానే ఉన్నా..గత ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన వేలాది మంది రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. బీఆర్ఎస్ సర్కారు కనీసం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేసి ఉంటే రైతులకు ఆర్థికంగా మేలు జరిగి ఉండేది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి ఆదివారం ప్రస్తావించారు. కాగా.. తాజా పంట నష్టం వివరాలపై ప్రభుత్వం నివేదిక కోరింది. కేవలం మొక్కుబడిగా వివరాలు సేకరించారా? లేక రైతులకు పరిహారం ఇచ్చే యోచన ఉందా? అనే విషయమై ప్రభుత్వ పెద్దలెవరూ ఇంకా ప్రకటన చేయలేదు. మరోవైపు నష్టపోయిన తమను సత్వరమే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.