అక్షరటుడే, వెబ్‌డెస్క్ UPI : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది.
నంబర్ ఆధారిత యూపీఐ చెల్లింపుల్లో వినియోగదారు సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కీలక అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 16, 2024న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా ఎన్‌పీసీఐ కొత్త నిబంధనని తీసుకొచ్చింది.
UPI : ఇలా చేయాలి..
తాజా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొబైల్ నంబర్ రద్దు జాబితా తెలుసుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలా కనీసం వారానికోసారి క్రమం తప్పకుండా వారి డేటాబేస్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధనల ప్రకారం..గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి బ్యాంకులు, చెల్లింపులు జరిపే వారు రద్దు చేయబడిన మొబైల్ నంబర్ల జాబితాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది. అనర్హమైన లేదా రద్దు చేయబడిన మొబైల్ నంబర్‌లను తొలగిస్తుంది.
బ్యాంకుకు లింక్ చేసిన, ఇకపై ఉపయోగంలో లేని నంబర్‌లు తొలగిస్తారు. ఇది 1 మొబైల్ నంబర్‌ను 2 బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసి, అదే బ్యాంకుతో ఆ మొబైల్ నంబర్‌ను ఉపయోగించడం కొనసాగించని కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. మార్చి 31, 2025 నాటికి అన్ని బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు ఈ కొత్త నియమాలను పాటించాలి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఎన్‌పీసీఐతో వివరణాత్మక నెలవారీ నివేదికలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్లకు లింక్ చేసిన యూపీఐ ఐడీల వివరాలను సైతం వెల్లడించాలి.