అక్షరటుడే, ఇందూరు: నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ధన్‌పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ప్రకటించాలన్నారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు అమలు చేయాలన్నారు. పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.