అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD | తిరుమలకు విచ్చేసే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నప్రసాదంలో ఇక నుంచి వడ కూడా వడ్డించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. అన్న ప్రసాదంతో అదనంగా ఒక పదార్థం వడ్డించాలని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగిస్తున్నట్లు ఛైర్మన్ వివరించారు. అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు.