అక్షరటుడే, నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ పథకం అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బృందాలు రంగంలోకి దిగాయి. నిజామాబాద్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఓ బృందం నాలుగు రోజులుగా విచారణ జరుపుతోంది. కీలక దస్త్రాలను తెప్పించి పనులు జరిగిన తీరు, ఖర్చు చేసిన నిధులపై ఆరా తీస్తోంది. ఇంటింటికి తాగు నీరు అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ సర్కారు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టింది. 2016లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు రూ.42 వేల కోట్ల అంచనా వ్యయంతో 25వేల నివాస ప్రాంతాలకు నీటిని అందించడమే లక్ష్యంగా పనులు చేపట్టారు. కానీ, చాలా చోట్ల మిషన్ భగీరథ లక్ష్యం నీరుగారింది. ముఖ్యంగా పలు చోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది.
ఆయన హయాంలోనే..
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ పథకానికి మొదటి వైస్ ఛైర్మన్. ఈయనే సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ఇదే సమయంలో సింహభాగం నిధులు వెచ్చించి పనులు పూర్తి చేశారు. సన్నిహితులు, దగ్గరి వ్యక్తులు, పార్టీ నాయకుల ద్వారా పలు చోట్ల పనులు చేయించారని ప్రచారంలో ఉంది. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వందల కోట్లు మిషన్ భగీరథ కోసం ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించిన దస్త్రాలను విజిలెన్స్ బృందం పరిశీలిస్తుండడం చర్చనీయాంశం అయ్యింది.
అధికారుల్లో భయం భయం
విజిలెన్స్ సోదాలతో జిల్లా అధికారుల్లో భయం మొదలైంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. కాంట్రాక్టర్లు మిషన్ భగీరథ పనులు మమ అనిపించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు సైతం నేతలు చెప్పినట్లు వినాల్సి వచ్చింది. వాస్తవానికి భగీరథ ద్వారా తాగునీటి సరఫరా నిరంతర ప్రక్రియ. ఇందులో భాగంగానే భారీ ట్యాంకులు, నీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించారు. ఏయే స్థాయిలో ఎక్కెడెక్కడ అక్రమాలు జరిగాయో గుర్తించేందుకు మరికొద్ది రోజులు సమయం పట్టనుంది. ఇందుకోసం విజిలెన్స్ బృందం నిజామాబాద్ లోనే తిష్ట వేసినట్లు తెలుస్తోంది.