అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు శనివారం ఉదయం నుంచి పలు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నారు. కస్టం మిల్లింగ్‌ రైస్‌ నిల్వలు ఉన్నాయా? లేదా? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. స్టాక్‌ రిజిస్టర్లను తనిఖీ చేసి సీజన్లో కేటాయించిన ధాన్యం నిల్వలపై పరిశీలిస్తున్నారు. అలాగే పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ విషయమై కూడా తనిఖీలు చేస్తున్నారు. నగర శివారులోని మాధవ నగర్లోని ఓ మిల్లుతో పాటు ఖానాపూర్‌లోని పలు మిల్లుల్లో తనిఖీలు జరుపుతున్నారు. అధికారుల తనిఖీలతో ఇప్పటికే పలు మిల్లర్లు అలర్ట్ అయ్యారు. వాస్తవానికి సన్న రకం ధాన్యం నిల్వలకు సంబంధించి పక్షం కిందటే అధికారులు తనిఖీలు చేయాల్సి ఉండగా.. మిలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమిషనర్ ను కలవడంతో వెనక్కి తగ్గారు. ప్రధానంగా అసోసియేషన్ లో కీలకంగా వ్యవహరిస్తున్న వారి మిల్లుల్లోనే పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వారికి సంబంధించిన మిల్లుల్లోనే సింహభాగం సీఎంఆర్ కోటా ఉన్నట్లు సమాచారం.