అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: స్టాక్ మార్కెట్లో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ప్రముఖ ఇన్వెస్టర్లు ఒక స్టాక్ లో పెట్టుబడి పెట్టారని తెలియగానే రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి ఆ స్టాక్స్ కొంటూ ఉంటుంటారు. గ్రీవ్స్ కాటన్ అనే కంపెనీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఏస్ ఇన్వెస్టర్ ఈ స్టాక్ కొన్న రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా వెయ్యి కోట్లు పెరగడం గమనార్హం. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా పేరు తెలియని వారు ఉండరు. ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీల షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆయన ఇటీవల గ్రీవ్స్ కాటన్ కంపెనీలో రూ.209 వద్ద సుమారు 12 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన కొనుగోలు చేసిన షేర్ల విలువ రూ.25కోట్ల వరకు ఉంటుంది. ఈ వార్త తెలియగానే రిటైల్ ఇన్వెస్టర్లు గ్రీవ్స్ కాటన్ షేర్లు కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. దీంతో రెండు రోజుల్లోనే గ్రీవ్స్ కాటన్ షేర్ ధర రూ.254కు చేరింది. కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.4,900 కోట్ల నుంచి రూ.5,900 కోట్లకు పెరిగింది. రెండు రోజుల్లోనే కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ రూ.వెయ్యి కోట్లు పెరిగిందన్నమాట.