అక్షరటుడే, భీమ్‌గల్ : BHEEMGAL : మున్సిపల్ పరిధిలో ఉపాధి హామీ పథకం పనులు లేక పలువురు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రస్తుతం తమకు ఎలాంటి ఉపాధి లేదని, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎడ్లబండ్ల ద్వారా ఇసుకను తరలించుకుని ఉపాధి పొందడానికి అవకాశం కల్పించాలని ఎడ్లబండ్ల నిర్వాహకులు కోరారు. సోమవారం పట్టణానికి చెందిన ఎడ్లబండ్ల నిర్వాహకులు సర్వ సమాజ కమిటీ హాల్లో అధ్యక్షుడు నీలం రవితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ఎడ్లబండ్ల నిర్వాహకులు తీసుకువచ్చే ఇసుకను కేవలం ఇంటి నిర్మాణాలకు మాత్రమే సరఫరా చేయడం జరుగుతుందని చెప్పారు. తద్వారా తమ కుటుంబాలకు ఉపాధి లభిస్తుందన్నారు.
గత కొంతకాలంగా ఎడ్లబండ్ల ద్వారా ఇసుక సరఫరా నిలిపివేయడంతో వీటిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. తాము ఎడ్లబండ్ల ద్వారా తెచ్చిన ఇసుకను కేవలం స్థానిక నిర్మాణాలకు విక్రయిస్తామని చెప్పారు.