అక్షరటుడే, ఇందూరు: Seed Agencies | రాష్ట్రంలో బోగస్ విత్తనోత్పత్తి కంపెనీలున్నాయని, వాటి ఆట కట్టిస్తామని సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పిలవబడుతున్న రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయన్నారు. హైదరాబాద్లోని హాకా భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు నట్టేట ముంచాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయన్నారు.
Seed Agencies | ఏజెన్సీ ప్రాంతాల్లో..
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సీడ్ కంపెనీలు, ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో సింజెంట, హైటెక్, బయర్ అనే మూడు మల్టీ నేషనల్ కంపెనీలు చేస్తున్న మోసాలు అన్నిఇన్నీ కావన్నారు. తప్పకుండా ఆయా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Seed Agencies | రైతులను నట్టేట ముంచుతున్నాయ్..
విత్తనోత్పత్తి కోసం మల్టీ నేషనల్ కంపెనీలు ఆర్గనైజర్స్కు ఏ ధర ఇస్తున్నాయో రైతులకు తెలియదు. రైతులకు ఇచ్చే ధర కూడా కంపెనీలకు తెలియదన్నారు. నోటి మాట, తెల్ల కాగితాలపై రాసిస్తూ రైతులను నిండా మోసగిస్తున్నాయన్నారు. వీరందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో నకిలీ విత్తన ఏజెన్సీల ఆట కట్టిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.