Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్​డెస్క్​: SLBC| శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ కెనాల్​(ఎస్​ఎల్​బీసీ) ట‌న్నెల్‌లో చిక్కుకున్న వారి కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని.. ట‌న్నెల్‌లో చిక్కుకున్న‌ వారి ఆన‌వాళ్లు క‌నిపెట్టేందుకు రోబోల‌ను సైతం వాడేందుకు అధికారులను ఆదేశించామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్‌ను సంద‌ర్శించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధానితో మాట్లాడి 11 కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌తో సహాయక చర్యలు చేపట్టి.. ట‌న్నెల్‌లో చిక్కుకున్న వారికోసం ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తున్నామ‌న్నారు.

SLBC| బీఆర్ఎస్‌కు మ‌తిపోయింది..

ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత మొత్తం మంత్రులు ఉత్తమ్‌, జూప‌ల్లితో స‌హా ప్ర‌భుత్వ యంత్రాంగం అంతా ట‌న్నెల్ వ‌ద్దే ఉంద‌న్నారు. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు హ‌రీశ్‌రావు దుబాయ్‌లో దావ‌త్‌లో ఉండ‌డం నిజం కాదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు మ‌తి కూడా పోయింద‌న్నారు. ప్రమాదం జరిగినప్పుడు కిషన్​రెడ్డి ఏ ప్రచారంలో ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు.

SLBC| కన్వేయ‌ర్ బెల్ట్ రిపేర్ చేయిస్తున్నాం..

ట‌న్నెల్‌లో క‌న్వేయ‌ర్ బెల్ట్ పాడ‌వ‌డంతో 13 కి.మీ లోప‌ల త‌వ్విన మ‌ట్టి, బుర‌ద‌ను బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోతున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. క‌న్వేయ‌ర్ బెల్ట్‌ను సోమ‌వారం లోగా రిపేర్ చేసేందుకు నిపుణులు అహోరాత్రులు ప‌నిచేస్తున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

SLBC|రాజకీయాలకు అతీతంగా ప‌నిచేద్దాం..

ఇది ఒక అనుకోని విప‌త్తు అని.. దీనిని ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వంతో ప్ర‌తిప‌క్షాలు అంతా క‌లిసి ఒక్క‌తాటిపైకి వ‌చ్చి కృషి చేయాల‌న్నారు. సంఘ‌ట‌న జ‌రిగిన గంట‌లోపే మంత్రులు అక్క‌డికి చేరుకున్నారని.. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా ట‌న్నెల్‌ను చూసేందుకు పంపించామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనే ఏ అధికారి, సిబ్బందికి చిన్న దెబ్బ కూడా త‌గ‌ల‌కుండా చూడాల‌ని సూచించాం.

SLBC| ప్ర‌పంచంలో 44 కి.మీ ట‌న్నెల్ ఎక్క‌డా లేదు..

ప్ర‌పంచంలో 44 కి.మీ ట‌న్నెల్ ఎక్క‌డా లేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి వివ‌రించారు. శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ కెనాల్​(ఎస్​ఎల్​బీసీ)ని నల్గొండ ఫ్లోరైడ్​ బాధితుల కోసం నిర్మిస్తున్నామ‌న్నారు. కాని గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం సొరంగంలో ప‌నుల‌కు క‌రెంట్ బిల్లులు కూడా ఇవ్వ‌లేద‌న్నారు. టన్నెల్​బోర్​ మిషన్​(టీబీఎం) స్పేర్​పార్ట్స్​ కోసం మంత్రి కోమటిరెడ్డిని అమెరికాకు కూడా పంపించామ‌న్నారు. మంత్రులు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement