అక్షరటుడే, హైదరాబాద్: BC reservation : బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం తెలిపింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లును, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్(Bc Reservation) ఇచ్చేలా మరో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
మండలిలోనూ ఈ బీసీ బిల్లులకు ఆమోదం లభించింది. ఇక కేంద్రానికి పంపించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చేలా చూస్తే.. బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత లభిస్తుంది. ఈ మేరకు కేంద్రంతో మాట్లాడి ఈ బిల్లులకు చట్టబద్ధత వచ్చేలా అన్ని పార్టీలను కలుపుకొని పోతామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
BC reservation : కామారెడ్డి డిక్లరేషన్..
కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration)లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి అసెంబ్లీలో రెండు రకాల బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇల్లు అలకగానే పండుగ కాదు అన్నట్లు దీనికి గవర్నర్ ఆమోదం లభించాలి. దీనికంటే ముందు కేంద్రం రాజ్యాంగంలో ఈ అంశాన్ని చేర్చాలి.
BC reservation : ఇక సుప్రీం కోర్టు ప్రకారం..
రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు పెంచుతూ బిహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలను సైతం కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే చట్ట పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 22 – 23 శాతం రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయి. మిగతా 20శాతం సీట్లను పార్టీపరంగా కేటాయించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పరంగా 42శాతం సీట్లను బీసీలకు దక్కేలా కాంగ్రెస్ చేస్తే, మిగతా పార్టీలు కూడా అలాగే చేయకతప్పదు.
BC reservation : పంచాయతీల వారీగా నివేదిక..!
దాదాపు 3 నెలల పాటు కసరత్తు చేసిన కమిషన్.. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై 700 పేజీలతో కూడిన నివేదికను అందజేసింది. ఏ గ్రామంలో ఎంత మంది బీసీలు ఉన్నారో కూడా పూర్తి వివరాలు ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. జనాభా ఆధారంగా ఏ పంచాయతీలో ఏయే వార్డులను బీసీలకు కేటాయించాలో సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు.
BC reservation : రిజర్వేషన్ల అప్లై ఇలా..
మండలాల యూనిట్‌గా సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. జిల్లా యూనిట్‌గా జడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లు ఉండబోతున్నాయి. రాష్ట్రం యూనిట్‌గా జడ్పీ ఛైర్మన్, సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
BC reservation : ఖరారు చేయడం ఇలా..
జిల్లాస్థాయిలోని అన్ని రిజర్వేషన్లను కలెక్టర్ల ఆధ్వర్యంలో ఖరారు చేస్తారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖకు పంపిస్తారు. కలెక్టర్లు ఖరారు చేసిన రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ ఈ గెజిట్ విడుదల చేస్తుంది. అనంతరం పూర్తి వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేస్తుంది.
BC reservation : ఇదీ పరిస్థితి..
తెలంగాణలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా, ఏజెన్సీల్లో మాత్రం 100 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకే కేటాయిస్తారు. మిగతా గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు ఆయా స్థానికంగా ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభాను ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో జనవరి, 2025 నాటికి పట్టణ స్థానిక సంస్థలు మొత్తం కలిపి 147 ఉన్నాయి. ఇందులో 15 నగర పాలక సంస్థలు, 131 పురపాలక సంఘాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఒకటి కావడం గమనార్హం.
BC reservation : 2019లో ఇలా..
2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇందులో బీసీలకు పంచాయతీల్లో 22.78 %, మండల పరిషత్‌లో 18.77 %, జిల్లా పరిషత్‌లో 17.11 % రిజర్వేషన్లు కేటాయించారు.
BC reservation : మారనున్న రిజర్వేషన్ల ముఖచిత్రం!
ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫారసు చేసినట్టు తెలిసింది. జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు ఇందులో కొంత మార్పులు చేర్పులు జరగవచ్చు. కాగా, ఈసారి బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత లభిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఒక్కసారి అమలు చేస్తే.. ఇక ఎప్పటికీ అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంటుంది.