అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajeev Yuva Vikasam | నిరుద్యోగ యువతకు చేయూత అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి రాయితీపై రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రుణం అందించనున్నారు.
దీనికోసం లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. మొదట ప్రభుత్వం ఈ నెల 5 వరకే దరఖాస్తులకు అవకాశం కల్పించింది. తర్వాత దీనికి వస్తున్న స్పందన, క్షేత్రస్థాయిలో సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 14 వరకు గడువు పొడిగించారు. అయితే ఇప్పటికి చాలా మంది దీనికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. సర్వర్ సమస్య, సాంకేతిక ఇబ్బందులతో దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీనికి తోడు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యంతో ఎంతోమంది దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.
Rajeev Yuva Vikasam | వరుస సెలవులు..
రాజీవ్ యువ వికాసం గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఆన్లైన్లో 14 రాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 13న ఆదివారం, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంది. ఈ క్రమంలో ఆయా సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునున్న వారు.. అవి రాక అప్లై చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి దరఖాస్తుల గడువును పెంచాలని పలువురు కోరుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.