అక్షరటుడే, వెబ్‌డెస్క్: పోలీస్ కస్టడీలో ఉన్న యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. యువకుడి మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్(32) జగిత్యాల జిల్లా కేంద్రంలో మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. కాగా.. కొంత మందిని దుబాయ్‌కి పంపించాడు. అక్కడ మోసపోయిన బాధితులు నిజామాబాద్ జిల్లాలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు ఇటీవల సంపత్తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విచారణ నిమిత్తం వారిని కోర్టు అనుమతితో రెండు రోజుల క్రితం పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. గురువారం విచారణ నిమిత్తం జగిత్యాలలోని కన్సల్టెన్సీకి తీసుకెళ్లారు. అనంతరం రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. పోలీసులు నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించగా.. ఆస్పత్రిలో సంపత్ మృతి చెందాడు. ఈ విషయమై సమాచారం ఇవ్వడంతో కుటుంబీకులు, బంధువులు శుక్రవారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు.
అనంతరం ఆస్పత్రి వద్ద రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు కొట్టడంతోనే సంపత్ మృతి చెందాడని ఆరోపించారు. తమకు న్యాయ చేసే వరకు అక్కడి నుంచి కదలబోమని బైఠాయించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.