జీవన్ రెడ్డి క ‘మాల్’

0

అక్షరటుడే, నిజామాబాద్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వరుస షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా ఆయన భార్య పేరిట ఉన్న జీవన్ రెడ్డి మాల్ టార్గెట్ గా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆర్మూర్ నడి ఒడ్డున ఆర్టీసీ స్థలంను విశ్వజిత్ ఇన్ఫ్రా గతంలో లీజుకు తీసుకుంది. ఈ స్థలంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన భార్య పేరిట సబ్ లీజు తీసుకొని రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకున్నారు. భారీ మాల్ నిర్మించారు. ప్రస్తుతం మొత్తం మాల్ కు సంబంధించి దాదాపు రూ.55 కోట్ల బకాయిలు పడినట్లు తెలుస్తోంది. ఇందులో స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు రూ.45కోట్లు (20 కోట్లు అసలు మరో 25 కోట్లు వడ్డీ), ఆర్టీసీ, ఎలక్ట్రిసిటీకి మరో రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇటీవలే ఆర్టీసీ అధికారులు ఈ మాల్ ను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఎలక్ట్రిసిటీ అధికారులు పవర్ కట్ చేశారు. సోమవారం స్టేట్ ఫైనాన్స్ అధికారులు జీవన్ రెడ్డి ఇంటికి నోటీసులు అతికించారు. బకాయి మొత్తం రూ.45 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఇన్నాళ్లు ఏం చేశారు?

2017 లో ఈ మాల్ నిర్మాణం కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధులు సమకూర్చింది. అప్పటి నుంచి తీసుకున్న రుణానికి సక్రమంగా ఈఎంఐ లు చెల్లించలేదని సమాచారం. అప్పట్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో అధికారులు బకాయిల జోలికి వెళ్లలేదు. ఆయన ఎన్నికల్లో ఓడిపోగానే వరుసగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

బిగుస్తున్న ఉచ్చు
జీవన్ రెడ్డి తీసుకున్న రుణం రూ.20 కోట్లు కాగా. మాల్ నిర్మాణంకు రూ.10 కోట్లు కూడా కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ నిధులను ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించారని ప్రచారంలో ఉంది. పైగా ఇంత మొత్తంలో అధికారులు రుణం మంజూరు ఎలా చేశారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ చేయించాలని అధికార కాంగ్రెస్ నాయకులు యోచిస్తున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సైతం ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. ఇవన్నీ జరిగితే జీవన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని తెలుస్తోంది.