అక్షరటుడే, ఇందూరు: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం తాగునీటి సరఫరా తీరుతెన్నులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. రానున్న వేసవి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. నీటి ఎద్దడి ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలన సభల సందర్భంగా పలుచోట్ల మిషన్ భగీరథ జలాలు ఇంటింటికీ సరఫరా కావడం లేదని ప్రజలు తన దృష్టికి తెచ్చారన్నారు. ఈ తరహా ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా ప్రతి ఇంటికి నీరందేలా సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు శుద్ధ జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈలు రాకేశ్, నరేశ్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.